సరికొత్త సంస్కరణలు, సాంకేతిక విప్లవంతో భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. డిజిటల్ చెల్లింపుల రంగంలో భారత్ నేడు ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఆయన సగర్వంగా ప్రకటించారు. నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా ‘ది హేగ్’ నగరంలో ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) ‘మాటామంతీ’ సమ్మేళనంలో ప్రధాని ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రగతిని వివరిస్తూనే, విదేశాల్లో భారత కీర్తిపతాకాన్ని ఎగురవేస్తున్న ప్రవాసులపై ప్రశంసల జల్లు కురిపించారు.భారతదేశం సాధించిన డిజిటల్ పురోగతిని ప్రధాని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం దేశంలో నెలకు ఏకంగా 20 బిలియన్ డాలర్ల మేర డిజిటల్ ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయని, ఇది దేశ బ్యాంకింగ్, సాంకేతిక వ్యవస్థల బలానికి నిదర్శనమని చెప్పారు. స్టార్టప్ రంగంలోనూ భారత్ అద్భుతాలు సృష్టిస్తోందని చెబుతూ.. ఒకప్పుడు దేశంలో కేవలం 4 యూనికార్న్ సంస్థలు (బిలియన్ డాలర్ల విలువైన స్టార్టప్‌లు) మాత్రమే ఉండేవని, కానీ నేడు ఆ సంఖ్య 100కు చేరిందని హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తు అవసరాలైన సెమీకండక్టర్ల తయారీ రంగంలోనూ భారత్ ముందడుగు వేసిందని, ఆ దిశగా పనులు శరవేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
సభకు హాజన ప్రవాస భారతీయుల నుంచి వ్యక్తమైన అపారమైన ప్రేమ, ఉత్సాహాన్ని చూసి తాను నెదర్లాండ్స్‌లో ఉన్నాననే సంగతి మరిచిపోయానని, భారతదేశంలోనే ఏదో ఒక ఉత్సవానికి హాజరైనట్లు అనిపించిందని ప్రధాని భావోద్వేగానికి లోనయ్యారు. "భారత స్నేహానికి 'ది హేగ్' నగరం ఒక సజీవ చిహ్నంగా మారింది. నెదర్లాండ్స్ నాయకత్వంతో నేను మాట్లాడిన ప్రతిసారీ వారు ఇక్కడి ప్రవాస భారతీయులను ప్రశంసిస్తూనే ఉంటారు. నెదర్లాండ్స్ సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు మీరు చేస్తున్న సేవలకు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు" అని మోదీ కొనియాడారు. ప్రవాసుల మూలాలను గుర్తుచేస్తూ.. "మీ పూర్వీకులు ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నో విషయాలను వదిలేసి ఉండవచ్చు. కానీ భారతదేశ మట్టి పరిమళం, పండుగల జ్ఞాపకాలు, భక్తి గీతాల రాగాలు, పూర్వీకులు అందించిన సంస్కారాలు, విలువలు ఎల్లప్పుడూ మీతోనే ఉండిపోయాయి. కాలక్రమేణా ఎన్నో సంస్కృతులు కనుమరుగయ్యాయనే వాస్తవానికి మానవ చరిత్రే సాక్ష్యం. కానీ భారతదేశ విభిన్న సంస్కృతి ఇప్పటికీ మన ప్రజల హృదయాల్లో బలంగా ఉంది. తరాలు మారినా, దేశాలు మారినా కుటుంబ విలువలు, మనమంతా ఒక్కటేననే భావన మారలేదు" అని ప్రధాని అన్నారు.
ప్రధాని మోదీ తన ప్రసంగంలో 2014 మే 16 నాటి ఎన్నికల ఫలితాల చారిత్రక సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. "సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే రోజున లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దశాబ్దాల తర్వాత భారతదేశంలో సంపూర్ణ మెజారిటీతో ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. నాటి నుంచి నేటి వరకు దేశంలోని కోట్లాది మంది భారతీయులు నాపై ఉంచిన నమ్మకమే నన్ను నిరంతరం నడిపిస్తోంది. ఆ నమ్మకం నన్ను ఎక్కడా ఆగనివ్వదు, అలసిపోనివ్వదు" అని ప్రధాని స్పష్టం చేశారు. లక్ష్యాలను అధిగమించి పనిచేస్తున్న ప్రవాస భారతీయులు దేశ ప్రతిష్ఠను మరింత పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్‌ను ఒక నమ్మకమైన భాగస్వామిగా నిలబెట్టడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. దేశీయంగా తయారవుతున్న సాంకేతిక పరిజ్ఞానం కేవలం భారతదేశ అవసరాలనే కాకుండా, ప్రపంచ సమస్యలకు సైతం పరిష్కారాలు చూపుతోంది. మన యువతలోని సృజనాత్మకత, వినూత్న ఆలోచనలే నేడు దేశంలో వందకు పైగా యూనికార్న్ సంస్థలు ఆవిర్భవించడానికి కారణమయ్యాయి.
india
డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం
Quick Summary:
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలో నంబర్-1: మోదీ.. నెలకు 20 బిలియన్ డాలర్ల డిజిటల్ లావాదేవీలు